వచ్చే నెలలో డోనాల్డ్ ట్రంప్ రెండో అభిశంసనపై చర్చ
అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై ఎల్లుండి (సోమవారం) సెనేట్‌లో విచారణ ప్రారంభంకానుంది. ఆ రోజు నాటికి అభిశంసన ఆర్టికల్‌ను సెనేట్‌కు పంపాలని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భావిస్తున్నారు.
సేనేట్‌లోని డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అభిశంసన విచారణను ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభంకానున్నది. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఆ ఘటన అంశంలో ట్రంప్‌ను అభిశంసించాలని హౌజ్ తీర్మానించింది. అయితే సోమవారం రోజున సేనేట్‌కు ఆ తీర్మానాన్ని పంపనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఎటువంటి అభిశంసన విచారణ ఉండదని పేర్కొన్నారు.
ఈ సమయంలోగా ట్రంప్ తన లాయర్లతో డిఫెన్స్ సిద్ధం చేసుకోనున్నారు. జనవరి ఆరవ తేదీన జరిగిన క్యాపిటల్ దాడి ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే జరిగినట్లు డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. క్యాపిటల్ ఘటనలో అయిదుగురు మృతిచెందారు.
గత యేడాది కూడా ట్రంప్‌పై అభిశంసన జరిగింది. అధికార దుర్వినియోగం కేసులో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ సేనేట్‌లో ఆయన నిర్దోషిగా తేలారు. ఈ బుధవారమే ట్రంప్ పదవీ కాలం ముగిసింది. జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రంప్ హాజరుకాలేదు.
శాశ్వతంగా మరో సారి అధ్యక్ష హోదాకు పోటీపడకుండా ఉండేందుకు డెమోక్రాట్లు ట్రంప్‌పై రెండోసారి అభిశంసనకు పట్టుబడుతున్నారు. అభిశంసన ప్రక్రియ నిష్పాక్షికంగా, సంపూర్ణంగా జరుగుతుందని సేనేట్‌కు చెందిన డెమోక్రాట్ నేత చక్ షూమర్ తెలిపారు.