1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (11:43 IST)

నేపాల్‌లో వరద బీభత్సం.. 38 మంది మృత్యువాత

పొరుగు దేశమైన నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. గత 20 రోజుల్లో వరదలు, కొండచరియలు విరిగిన పడిన ఘటనల్లో ఇప్పటివరకు 38 మంది మృత్యువాతపడగా, 51 మందికి పైగా గాయపడ్డారు. మరో 24 మంది గల్లంతయ్యారు. 
 
గత కొన్ని రోజులుగా నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల బీభత్సం కొనసాగుతోంది. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. 
 
నేపాల్‌లో గత 20 రోజుల్లో.. వరదలు, కొండచరియలు విరిగిన పడిన ఘటనల్లో ఇప్పటి వరకు 38 మంది మరణించారు. 51 మందికి పైగా గాయపడ్డారు. మరో 24 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు నేపాల్ హోంశాఖ తెలిపింది. కొండ చరియలు, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1,250 మంది ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.
 
అధికారిక లెక్కల ప్రకారం.. నేపాల్‌లో సింధుపాల్ చౌక్ జిల్లాలో ఐదుగురు, దోతి జిల్లాలో నలుగురు, గోర్ఖాలో ముగ్గురు, రోల్పాలో మరో ముగ్గురు మరణించారు. చితావన్, తన్హూన్, ప్యుతాన్, రౌతహత్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. 
 
లలిత్‌పూర్, ఖోటాంగ్, సప్తారి, కేవర్, దాడింగ్, సింధూలి, జుమ్లా, అర్ఘాఖాచీ, దంగ్, పల్పా, కస్కి, కాలికోట్, పంచ్‌తర్, బఝంగ్, బజూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. శనివారం వరకు నేపాల్ వ్యాప్తంగా 790 ఇళ్లు నీటమునిగాయి. 
 
వర్షాలు, వరధ ధాటికి 519 ఇళ్లు, 90 పశుల పాకలు, 19 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 5,100 మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర సాయుధ బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.