నేపాల్‌లో భారీ వరదలు-పశుపతినాధ్ ఆలయం వరద.. 240మంది మృతి (video)
నేపాల్‌లో భారీ వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 240 మందికి పైగా మరణించారు. రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశమంతటా 240 మందికి పైగా మరణించగా, పలువురు గల్లంతయ్యారు. నేపాల్ ప్రభుత్వం బుధవారం భారీ వర్షాల కోసం కొత్త హెచ్చరికను జారీ చేసింది.
బాగ్మతి ప్రావిన్స్‌లతో పాటు ఖాట్మండు లోయలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి రమేష్ లేఖక్ ఆదేశించారు.
వరద బాధిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 13,071 మందిని రక్షించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ తివారీ తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని రిషిరామ్ వెల్లడించారు. తూర్పు, మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.