గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:52 IST)

నేడు క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు - ఆ దేశాలకు నో ఆహ్వానం

Queen Elizabeth 2
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను బ్రిటన్ దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్లు, పార్కులు, స్క్వేర్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. పార్లమెంట్ స్క్వేర్ మీదుగా అంతిమ యాత్రం నిర్వహిస్తారు. 
 
మొత్తం 11 రోజుల సుధీర్ఘ సంతాప దినాల తర్వాత ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే ఆమె బ్రిటన్‌కు చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, రాణి అంత్యక్రియలను బ్రిటన్‌లోని 125 థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీనికితోడు దేస వ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు పార్కులు, క్యాథెడ్రల్స్, స్క్వేర్స్‌లలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలిజబెత్ బామ్మ క్వీన్ విక్టోరియాను తీసుకొచ్చిన ఫిరంగిపైనే రాణి పార్థివదేహాన్ని కూడా తీసుకునిరానున్నారు. ఈ ఫిరంగని 142 మంది సెయిలర్స్ లాగుతూ  తీసుకొస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది ఈ అంత్యక్రియలను వీక్షించవచ్చు. 
 
రాణి భౌతికకాయాన్ని తీసుకెల్లే దారిలో ఇరువైపులా రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ సిబ్బంది గౌరవ సూచకంగా నిలబడి వుంటారు. ఆమె తుది యాత్ర పార్లమెంట్ స్క్వేర్ మీదుగా వెళుతుంది. అక్కడ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్  సిబ్బంది రాణి పార్థివదేహానికి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పిస్తారు. స్కాటిష్, ఐరిష్ రెజిమెంట్ల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. రాణి శవపేటికను కింగ్ చార్లెస్‌తో పాటు రాయలీ ఫ్యామిలీ సభ్యులు అనుసరిస్తారు. 
 
ఇదిలావుంటే, ఈ అంత్యక్రియలకు రష్యా, ఆప్ఘనిస్థాన్, మయన్మార్, సిరియా, నార్త్ కొరియా దేశాలను ఆహ్వానించలేదు. కాగా, 96 యేళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన రాణి ఎలిజబెత్ 2 70 యేళ్ల 214 రోజుల పాటు సుధీర్ఘకాలంపాటు రాణిగా కొనసాగి సరికొత్త రికార్డును నెలకొల్పారు.