బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (15:07 IST)

హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

సాంకేతికంగా నిపుణులైన విదేశీ ఉద్యోగులను పనిలో పెట్టుకొనేందుకు అమెరికన్ కంపెనీలకు అనుమతినిచ్చేదే హెచ్1బీ వీసా. ఈ వీసా ద్వారా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు ప్రతి ఏటా వేల సంఖ్యలో భారత్, చైనా నుంచి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. హెచ్1బీ వీసాపై ఏటా లక్ష మందికి పైగా విదేశీ ఉద్యోగులు అమెరికాకు వస్తున్నారు. 
 
అలాంటి హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును పెంచనున్నారు. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణనిచ్చే అప్రెంటిస్ కార్యక్రమాలకు అవసరమైన నిధులు పెంచేందుకుగాను హెచ్1బీ వీసా దరఖాస్తుల ఫీజును పెంచాలని ప్రతిపాదించినట్టు అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా వెల్లడించారు. 
 
ఈ ప్రతిపాదనతో అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై గణనీయంగా ఆర్థికభారం పడనుంది. అక్టోబరుతో ప్రారంభమయ్యే 2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ, హెచ్1బీ దరఖాస్తు పత్రాలలో కూడా మార్పులు చేయనున్నట్టు ఆయన తెలిపారు. మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేసే కంపెనీల నుంచి అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.