శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (16:53 IST)

ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

కరోనా వైరస్ రోగుల నుంచి అప్రమత్తం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రేయషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరోగ్య సేతు యాప్ కరోనా క్లస్టర్లను గుర్తించడమేకాకుండా, పరీక్షలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి బాగా ఉపయోగపడిందని తెలిపింది. 
 
ఇదే అంశంపై టెడ్రోస్ స్పందిస్తూ, కొవిడ్-19 గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు సెల్ఫ్ ఐసోలేషన్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ వంటి ప్రయోగాత్మకంగా పరీక్షించిన ప్రజారోగ్య సాధనాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
మొబైల్ అప్లికేషన్ వంటివి వీటిని మరింత ప్రభావవంతంగా పనిచేయించేలా చేయగలవన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్‌ను 150 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్టు టెడ్రోస్ గుర్తు చేశారు.
 
కరోనా రెడ్ జోన్ కస్టర్లు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి లక్ష్యానికి అనుగుణంగా కొవిడ్-19 పరీక్షలను పెంచడంలో నగర ప్రజారోగ్య విభాగాలకు ఆరోగ్యసేతు యాప్ ఎంతగానో సాయ పడిందని అథనోమ్ ప్రశంసించారు. 
 
కాగా, కొవిడ్ ట్రాకింగ్ యాప్ అయిన ఆరోగ్యసేతును భారత ప్రభుత్వం ఏప్రిల్‌లో తీసుకొచ్చింది. ఎవరైనా యూజర్ అప్పటికే కొవిడ్ సోకిన వారి సమీపానికి వెళ్లినప్పుడు ఇది అప్రమత్తం చేస్తుంది. ప్రపంచ బ్యాంకు కూడా ఈ యాప్‌ను కొనియాడింది.
 
భారత్‌తోపాటు జర్మనీ (కరోనా వార్న్ యాప్), యూకే (ఎన్‌హెచ్ఎస్’ఎస్ కొవిడ్-19 యాప్) వంటివి కొవిడ్ ట్రాకింగ్ యాప్‌లను తీసుకొచ్చినట్టు అధనోమ్ గుర్తు చేశారు. కరోనా సోకిన వ్యక్తులను ఇవి గుర్తించి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు తోడ్పడతాయని చెప్పుకొచ్చారు.