గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (09:38 IST)

ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్‌తో తలపడేది ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నెల పదో తేదీతో ఈ టోర్నీ ముగియనుంది. అయితే, ఇప్పటికే ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడేది ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఇందులోభాగంగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. 
 
ఆదివారం రాత్రి 7 గంటలకు అబుదాబి వేదికగా జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు, ఫైనల్స్‌కు చేరి, మంగళవారం జరిగే తుది పోరులో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. 
 
ఇప్పటికే ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఫైనల్స్‌లో ఆ జట్టుతో తలపడాలంటే, హైదరాబాద్ జట్టు తన ముందున్న తొలి అడ్డంకి ఢిల్లీని ఓడించాల్సి వుంటుంది. 
 
ఇంతవరకూ ఒక్కసారి కూడా ఫైనల్స్‌కు చేరని ఢిల్లీ జట్టు, ఈ సీజన్‌లో అనూహ్య విజయాలను సాధిస్తూ టాప్-2గా నిలిచింది. అదేసమయంలో హైదరాబాద్ జట్టు పడుతూ, లేస్తూ సాగి, తన చివరి లీగ్ మ్యాచ్‌లో బలమైన ముంబై జట్టుపై విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. 
 
ఇక ఢిల్లీ, హైదరాబాద్ జట్ల ఫామ్ ను పరిశీలిస్తే, వార్నర్ సేనకే అవకాశాలు అధికమనడంలో సందేహం లేదు. తొలి 9 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన హైదరాబాద్ జట్టు, ఆపై పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. 
 
సన్ రైజర్స్ జట్టుకు బౌలింగ్ ప్రధాన అస్త్రమైతే, డీసీకి బ్యాటింగ్ అస్త్రంగా ఉంది. గడచిన ఆరు మ్యాచ్‌లలో హైదరాబాద్‌తో ఆడిన జట్లలో కేవలం ఒక్కసారి మాత్రమే 150కి పైగా పరుగులు సాధించారంటే, ఆ జట్టు బౌలింగ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
ఇక డీసీని పరిశీలిస్తే, తొలి 9 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచి, ఆపై వరుసగా నాలుగు సార్లు ఓడిపోయిన ఆ జట్టు, పడుతూ, లేస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. రెండు సెంచరీలు చేసిన డీసీ స్టార్ ప్లేయర్ ధావన్ నాలుగు సార్లు డక్కౌట్ కావడం ఆ జట్టును కలవర పెడుతోంది. 
 
ఇక, పృధ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు సున్నా పరుగులకే పెవీలియన్ చేరారు. అయితే, కేవలం మూడు గంటల వ్యవధిలో ఏ జట్టు ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తారో, వారిదే విజయమయ్యే టీ-20లో నేటి మ్యాచ్‌లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమే.
 
మరోవైపు, ఈ ఇరు జట్లూ ఇప్పటివరకు 17 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ ఆరింటిలో హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్‌లలో విజయభేరీ మోగించాయి. 13వ సీజన్‌లో రెండు సార్లు తలపడ్డాయి. 
 
ఇందులో సెప్టెంబరు 29వ తేదీన జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ (164/4) జట్టు ఢిల్లీ (147/7)పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. అలాగే, అక్టోబరు 27న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా, హైదరాబాద్ జట్టు 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 88 రన్స్ చేసింది. 
 
తుది జట్ల అంచనా... 
హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహూ, జాసన్ హోల్డర్, నదీమ్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టి నటరాజన్. 
 
ఢిల్లీ : అజింక్యా రహానే, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మేయర్, మెర్క్యూస్ స్టాయిన్స్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, ఎన్రిచ్ నోర్ట్జ్, తుషార్ దేశ్‌పాండే.