శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (21:16 IST)

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ : ఆర్సీబీ పేలవ ప్రదర్శన.. సన్‌రైజర్స్ టార్గెట్ 132 రన్స్

ఐపీఎల్ 13వ అంచె పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ 1 అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ప్రత్యర్థి జట్టు ముంగిట కేవలం 132 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. 
 
కాగా, అత్యంత కీలకంగా భావించే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, సూపర్ ఫామ్‌లో ఉన్న వృద్ధిమాన్ సాహా ఈ మ్యాచ్‌కు దూరమవడం సన్ రైజర్స్‌కు తీరని లోటు అని చెప్పాలి. సాహా స్థానంలో గోస్వామి జట్టులోకొచ్చాడు. అతడు సాహా లేని లోటు ఎంతమేరకు తీరుస్తాడన్నది సందేహమే.
 
మరోవైపు, బెంగళూరు జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. క్రిస్ మోరిస్ గాయం కారణంగా తప్పుకున్నాడు. పెద్దగా రాణించని జోష్ ఫిలిప్పే, షాబాజ్ అహ్మద్ లను పక్కనబెట్టారు. ఇసురు ఉదనకు తుది జట్టులో స్థానం లభించలేదు. ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, మొయిన్ అలీ జట్టులోకొచ్చారు. కాగా, 'ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇక ఇంటికే' అన్న నేపథ్యంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. 
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ జట్టు మ్యాచ్ ఆద్యంతం పేలవ ప్రదర్శన కొనసాగించింది. ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పడిక్కల్ కూడా కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో 3.3 ఓవర్లలో 15 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ఆర్సీబీ... ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. 
 
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అరోన్ ఫించ్ 32, డీ విలియమ్స్ 56 చొప్పున పరుగులు చేశారు. వీరిద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లంతా అటొచ్చి ఇటెళ్ళిపోయారు. అలీ డకౌట్ కాగా, దుబే 8, సుందర్ 5, షైనీ 9, సిరాజ్ 10 చొప్పున పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.