గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By Selvi
Last Updated : శనివారం, 28 జూన్ 2014 (17:04 IST)

రంజాన్ నెల ప్రారంభం: ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు!

మహమ్మదీయుల పవిత్ర గ్రంథం "ఖురాన్" ఆవిర్భవించిన పుణ్యమాసం రంజాన్... ఈ నెల 29వ తేదీ (ఆదివారం) నుంచి ప్రారంభమవుతోంది. "రంజాన్ లేగా రమదాన్" అని పిలిచే ఈ మాసంలో మహమ్మదీయులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠ నియమాలతో గడిపే ఈ మాసం ఇస్లామ్ కేలండర్‌లో ఒక నెలపేరు. ఇది ఇస్లామ్ కేలండర్ నెలల క్రమంలో తొమ్మిదోది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట భోజనం పెడితే ఆ అల్లా 1000 పూటల ఆహారం ప్రసాదిస్తాడని విశ్వాసం. 
 
ముస్లిం సోదరులు ఈ మాసమంతా ఉపవాస దీక్షను పాటించి మాస చివరన అత్యంత పవిత్రంగా "రంజాన్" పండుగను జరుపుకుంటారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం 'ఉపవాసవ్రతం'. ముస్లిం సోదరులు కూడా 'చాంద్రమాన కేలండర్'ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్'‌గా పరిగణింపబడుతోంది.
 
రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడంతో పాటు నిష్ట నియమాలతో కూడుకున్న జీవితం గడుపుతారు. తెల్లవారుజామున మాత్రమే ఆహారం తీసుకుని రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీక్షను విరమిస్తారు.