బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (15:26 IST)

హైదరాబాద్‌ల 5జీ బిజినెస్ డెమో - పది రెట్ల వేగంతో డౌన్‌లోడ్

దేశంలో అత్యాధునిక టెక్నాలజీ శరవేగంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే 5జీ సేవలను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. ఇపుడు దాని ప్రత్యర్థి ఎయిర్ టెల్ కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో గురువారం వాణిజ్య నెట్‌వర్క్‌లపై డెమో కూడా ఇచ్చింది. 
 
నాన్ స్టాండ్ అలోన్ (ఎన్ఎస్ఏ) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్జ్ బ్యాండ్‌లో 5జీ, 4జీ రెండింటినీ సమాంతరంగా పనిచేయించి చూపించింది. ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌లతో పోలిస్తే ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 
 
ఓ సినిమాను కేవలం కొన్ని క్షణాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అంటున్నారు. తమకు పరికరాలను అందించే ఎరిక్సన్‌తో కలిసి కొత్త 5జీని ఆవిష్కరించినట్టు సంస్థ తెలిపింది. 
 
1800 మెగాహెర్జ్, 2100, 2300 మెగాహెర్జ్‌ల తరంగదైర్ఘ్యాల వద్ద ఇది పనిచేస్తుందని చెప్పింది. ఇటు సబ్ గిగాహెర్జ్ బ్యాండ్స్ అయిన 800 మెగా హెర్జ్, 900 మెగా హెర్జ్ వద్ద కూడా మంచి సేవలు అందుతాయని తెలిపింది.
 
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కొన్ని నెలల్లోనే దానిని అందుబాటులోకి తెస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఇప్పుడున్న స్పెక్ట్రమ్ పరిధిలోనే తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.