గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

'ఫేస్‌బుక్' మరో సంచలన నిర్ణయం.. ఫేషియల్ రికగ్నైషన్ తొలగింపు

ప్రముఖ సోషల్ ప్రసారమాధ్యమం ఫేస్‌బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో వ్యక్తిగత గోప్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌లో ఫేషియల్‌ రికగ్నైషన్‌ను తొలగించడానికి ఫేస్‌బుక్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 
 
ఫేస్‌ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్‌ కంపెనీ మాతృసంస్థ ‘మెటా’ తెలిపింది. ఫేషియల్‌ రికగ్నైషన్‌ టెక్నాలజీలో ఇదోక భారీ మార్పు అని ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెరోమ్‌ పెసెంటి తెలిపారు. 
 
'విస్తృత వినియోగం నుంచి పరిమిత వినియోగానికి కుదించడానికి ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను మేము తొలగించనున్నాం. ఫేస్‌బుక్‌లో దీన్ని ఉపయోగిస్తున్నవారు ఇక భవిష్యత్‌లో ఈ సాంకేతికతను ఉపయోగించలేరు. ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే టెంప్లేట్‌లను తొలగించనున్నాం' అని తన బ్లాగ్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను ఫేస్‌బుక్‌ 2010లో తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజర్లలో మూడొంతుల మంది ఫేషియల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను తొలగించడం వల్ల ఒక బిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమెటిక్‌ ఆల్ట్‌ టెక్ట్స్‌ (ఏఏటీ)పై దీని ప్రభావం పడనుంది. 
 
యూజర్ల ఖాతాల్లోని వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్‌లు తొలిగిపోనున్నాయి. ఫోటోలు, వీడియోల్లోని ముఖాలను ఫేస్‌బుక్‌ దానంతట అది గుర్తించదు. ఫొటోల్లోని వ్యక్తి సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్‌ చేయడానికి ఇక కుదరదు. ఇక ఫొటోల్లోని వ్యక్తులను ఇతరులు గుర్తించకుండా సాధ్యపడుతుంది.