బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (14:27 IST)

మీడియా పరిశ్రమను ఆదుకునేందుకు ఫేస్‌బుక్ సిద్ధం

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మీడియా కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన మీడియా పరిశ్రమను ఆదుకునేందుకు మరో 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఫేస్‌బుక్ జర్నలిజం ప్రాజెక్టు ద్వారా స్థానిక మీడియా సంస్థలకు అత్యవసర గ్రాంటు కింద 25 మిలియన్ డాలర్లు, మార్కెటింగ్ ద్వారా పబ్లిషర్లకు ఆదాయం కల్పించేలా మరో 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిషర్లకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
 
ఇప్పటికే స్థానిక మీడియా సంస్థల కోసం ఒక మిలియన్ డాలర్లు, ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలకు ఒక మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ కోసం 1 మిలియన్ డాలర్లు ప్రకటించామని ఫేస్‌బుక్ పేర్కొంది. తొలి విడతలో తాము ప్రకటించిన సాయాన్ని అమెరికా, కెనడాల్లోని 50 స్థానిక మీడియా సంస్థలకు అందించినట్టు తెలిపింది. 
 
కరోనా మహమ్మారిపై ప్రజలకు సమాచారం అందించేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య వార్తా పరిశ్రమ పనిచేస్తున్నదని ఈ సందర్భంగా ఫేస్‌బుక్ కొనియాడింది. కోవిడ్-19 కారణంగా ఆదాయం పడిపోవడంతో స్థానిక జర్నలిస్టులపై తీవ్ర ప్రభావం పడిందనీ.. మరోవైపు తమ కుటుంబాలు, బంధు మిత్రులకు సంబంధించిన కీలక సమాచారం కోసం ప్రజలు జర్నలిస్టులపైనే ఆధారపడుతున్నారని ఫేస్‌బుక్ పేర్కొంది.