ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:53 IST)

ఫేక్‌న్యూస్‌ను పసిగట్టే పరిజ్ఞానంతో ముందుకొచ్చిన వాట్సాప్

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. మన దేశంలో ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసత్యవార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతుండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా అసత్య సమాచారం విపరీతంగా వ్యాపిస్తుండటంతో అటువంటి సమాచారానికి అడ్డుకట్ట వేయాలని ఫేస్‌బుక్, వాట్సాప్‌లను చాలాసార్లు హెచ్చరించింది. అప్పటి నుండి ఫేస్‌బుక్, వాట్సాప్‌లు అసత్య వార్తలను నిరోధించడానికి చర్యలు ప్రారంభించాయి.
 
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అసత్యవార్తలు ప్రచారం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు ‘చెక్‌ పాయింట్‌ టిప్‌లైన్‌’ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమకు వచ్చే సందేశాలపై  ఏమాత్రం అనుమానం ఉన్నా చెక్‌పాయింట్‌ టిప్‌లైన్‌ నంబర్ +91 96430 00888కు కాల్ చేసి తెలియజేయవచ్చు. ఇండియాకు చెందిన మీడియా నైపుణ్యాల అంకుర సంస్థ "ప్రోటో" ఆవిష్కరించిన టిప్‌లైన్‌ సేవల ద్వారా ఎన్నికల సమయంలో వాట్సాప్‌లో చక్కర్లు కొట్టే వదంతులు, అసత్య వార్తలను సులభంగా తెలుసుకోవచ్చు.
 
అనుమానాస్పద సందేశాలను టిప్‌లైన్‌ ద్వారా నివేదిస్తే ప్రోటోకు చెందిన కేంద్రం ఆ సందేశాన్ని తనిఖీ చేసి, అది నిజమైనదో కాదో చెబుతుంది. సందేశానికి సంబంధించిన విషయాన్ని టిప్‌లైన్ నిజం, అబద్ధం, తప్పుదోవ పట్టించేది, అనుమానాస్పదమైనది, తమ పరిధిలో లేనిది అని వర్గాల వారీగా నిర్ధారించుకుని వెల్లడిస్తుంది. ఫోటోలు, వీడియోలు, లింక్‌లు, అక్షరాల రూపంలో ఉన్న సమాచారం ఏదైనా సరే ఈ కేంద్రం విశ్లేషించి చెబుతుంది. ఆంగ్లంతో పాటు, తెలుగు, హిందీ, బెంగాలీ, మలయాళం భాషల్లోని సందేశాలను ఇది క్రోడీకరించగలదు.