శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (09:28 IST)

నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ఐటీ కంపెనీలు

దేశంలోని ఐటి కంపెనీలు నిరుద్యోగులకు శుభవార్త చెప్పాయి. దేశంలోని మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలను ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో అందుకున్నాయి. దీంతో మందగమనంలో నడుస్తున్న ఐటీ పరిశ్రమ తిరిగి కోలుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో 17,446 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. దీంతో ఈ సంవత్సరంలో దాదాపు లక్షా ఐదువేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఈ కంపెనీలు హామీ ఇస్తున్నాయి.
 
ముఖ్యంగా, దేశంలో అతిపెద్ద ఐటీ సెక్టార్‌గా ఉన్న టీసీఎస్ జూన్ త్రైమాసికంలో రూ 9,000 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, విప్రో సంస్థ కూడా మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇక, మరో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా మొదటి త్రైమాసికంలో గత పదేళ్ళలో అత్యధిక లాభాలను ఆర్జించింది. 
 
ఇది కరోనా కష్టకాలంలోనూ ఐటీ రంగం వృద్ధిని చూసిస్తోందని, అందువల్ల జూలై-సెప్టెంబరులో 6000 మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు ఇస్తామని, 2021-22లో 30,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా విప్రో హామీ ఇచ్చింది.
 
కరోనా కారణంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాయి. ఇది మంచి ఫలితాలను రాబట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ విద్య వంటి కార్యకలాపాల వలన కంపెనీలకు పెద్ద ఒప్పందాలు వచ్చాయి.