శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (23:53 IST)

కొత్త ఐటీ చట్టం.. 20 లక్షల అకౌంట్లను తొలగించిన వాట్సాప్..!

కొత్త ఐటీ చట్ట ప్రకారం సోషల్ మీడియా యాప్‌లు ప్రతి నెల కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ సైతం ఈ నెలలో ఇదివరకే తమ నెలవారీ నివేదికలు కేంద్రానికి సమర్పించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించింది. ఇక వాట్సాప్‌కు దేశంలో 5 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో ఏకంగా 20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. తన నెలవారీ నివేదికలో వాట్సాప్ ఈ మేరకు తెలిపింది. హానికరమైన ప్రవర్తనతో కూడిన ఖాతాలను, అనవసరమైన సందేశాలను పంపే ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వాట్సాప్ తేల్చి చెప్పింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యన ఈ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది.
 
ఇలాంటి ఖాతాలను ముందే గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హాని జరిగాక స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవడం సబబు అని భావిస్తున్నట్టు తన నివేదికలో తెలిపింది. అవాంఛనీయ ఖాతాలను గుర్తించేందుకు అనువైన సాధనాలను ఏర్పాటు చేశామని వాట్సాప్ వెల్లడించింది. అనధికారికంగా బల్క్ మేసేజింగ్ వాడకం వల్లే ఎక్కువ ఖాతాలను బ్యాన్ చేసినట్లు వివరించింది.