మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr

2020కల్లా 5జీ సేవలు.. 10 వేల ఎంబీపీఎస్ వేగంతో...

ప్రస్తుతం 4జీ నామస్మరణ చేస్తున్న దేశీయ టెలికం రంగంలో వచ్చే మూడేళ్ళలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2020కల్లా ఐదోతరం టెలికం సేవలు ప్రారంభించేందుకు వీలుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కేంద

ప్రస్తుతం 4జీ నామస్మరణ చేస్తున్న దేశీయ టెలికం రంగంలో వచ్చే మూడేళ్ళలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2020కల్లా ఐదోతరం టెలికం సేవలు ప్రారంభించేందుకు వీలుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 
 
దీనిపై టెలికం మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ, ఐదో తరం టెలికం సేవల లక్ష్యాలపై కసరత్తు చేసేందుకు వీలుగా ఉన్నత స్థాయి 5జీ కమిటీని ఏర్పాటు చేశాం. 2020లో అభివృద్ధి చెందిన మార్కెట్లతోపాటు భారత్‌లోనూ 5జీ సేవలు ప్రారంభించేందుకు వీలుంటుందని చెప్పారు. 
 
5జీ సేవలపై పరిశోధన, అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్ తరం టెలికం టెక్నాలజీ ద్వారా నగరాల్లో 10 వేల ఎంబీపీఎస్ (మెగాబైట్ పర్ సెకండ్), గ్రామాల్లో 1000 ఎంబీపీఎస్ వేగంతో సేవలందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
3జీ, 4జీ విషయంలో అవకాశాన్ని కోల్పోయిన భారత్.. 5జీ టెక్నాలజీ ప్రమాణాలు, ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో తనవంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నదని మనోజ్ సిన్హా అన్నారు. 
 
వచ్చే 5-7 యేళ్ళలో భారత మార్కెట్లో 50 శాతం, గ్లోబల్ మార్కెట్లో 10 శాతం వాటా దక్కించుకునే లక్ష్యంతో గ్లోబల్ ఉత్పత్తులకు ధీటుగా మన దేశంలోనే 5జీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతోపాటు తయారు చేసే దిశగా కృషి చేయనున్నాం అని ఆయన పేర్కొన్నారు.