మొబైల్ కస్టమర్లకు షాక్.. త్వరలో ఉచిత కాల్స్ బంద్... ట్రాయ్ పరిశీలన (Video)
మొబైల్ కష్టమర్లకు షాకింగ్ న్యూస్. కష్టాల కడలిలోవున్న టెలికాం కంపెనీలను ఒడ్డుకు చేర్చేందుకు టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉచిత కాల్స్‌ను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తద్వారా టెలికాం కంపెనీలను కొంతమేరకు ఒడ్డుకు చేర్చవచ్చని ట్రాయ్ భావిస్తోంది. ఫోను కాల్ కోసం కనీస చార్జీని నిర్ణయించనున్నట్టు సమాచారం.
రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికాం రంగ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఉచిత కాల్స్, డేటాతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటివరకు కాల్స్‌కు, డేటాకు వేర్వేరుగా రీచార్జ్‌లు చేసుకునే వినియోగదారులకు ఆ అవకాశమే లేకుండా పోయింది. ఒకసారి రీచార్జ్ చేసుకుంటే ఇక అన్నీ ఉచితమే అన్న జియో ప్లాన్లు వినియోగదారులను కట్టిపడేశాయి. ఫలితంగా అనతికాలంలోనే జియో అగ్రస్థానికి చేరుకుంది.
ఈ జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఫలితంగా ఇవి కూడా జియో దారికి రాకతప్పలేదు. ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు అవి కూడా ఉచితాలను ప్రకటించక తప్పలేదు. మరోవైపు అప్పుల్లో కూరుకుపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టెలికం కంపెనీలు ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికంకు ఏకంగా రూ.92,500 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. దీంతో తమను కష్టాల నుంచి బయటపడేయాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గుబా ఆధ్వర్యంలో కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ టెలికం సంస్థల ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించనుంది. అలాగే, ఉచిత ఆఫర్లను వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనను కూడా చేయనున్నట్టు సమాచారం.
కంపెనీల ఆదాయానికి గండికొట్టే ఇటువంటి వాటికి ఇక చెక్ పెట్టడం ద్వారా కంపెనీలను కష్టాల ఊబి నుంచి బయట పడేయవచ్చని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బెయిలవుట్ ప్యాకేజీ కింద టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సూచనలు చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఫోన్ కాల్స్, డేటా సర్వీసులకు కనీస చార్జీలను ప్రకటించే అంశాన్ని ట్రాయ్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.