ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (18:42 IST)

టీసీఎస్ అదుర్స్.. రిలయన్స్‌ను వెనక్కి నెట్టింది.. అగ్రస్థానంలో నిలిచింది

దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ఐటీసంస్థగా అవతరించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అసెంచర్‌ను దాటి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం టీసీఎస్‌ మార్కెట్‌ విలువ 169.9 బిలియన్‌ డాలర్లు దాటడంతో సంస్థ ఈ ఘనత దక్కించుకుంది.
 
కాగా.. గతేడాది అక్టోబరులో టీసీఎస్‌ తొలిసారిగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అప్పుడు కూడా అసెంచర్‌ను దాటి సంస్థ ఈ రికార్డు సాధించింది. ఆ తర్వాత కంపెనీ షేరు విలువ పడిపోవడంతో మార్కెట్‌ విలువ తగ్గింది. దీంతో మళ్లీ రెండో స్థానానికి పడిపోయిన టీసీఎస్‌.. తాజాగా నంబర్‌ వన్‌ కంపెనీగా అవతరించింది.
 
దేశంలోనూ అత్యంత విలువైన సంస్థగా టీసీఎస్‌ మళ్లీ తొలి స్థానానికి ఎగబాకింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను దాటి ఐటీ దిగ్గజం ఈ ఘనత సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్‌ రాణించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 7.2శాతం పెరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో టీసీఎస్‌ షేర్లు లాభాలను సాధిస్తున్నాయి.