గ్రూప్ అంటే సమూహం. ప్రవాహం కాదు. వాట్సప్ గ్రూపులు అభిప్రాయాల కలబోతకు వేదికగా ఉండాలి. అంతేతప్ప రైల్వే ప్లాట్‌ఫార్మ్ Left అయ్యేవాళ్లు add అయ్యేవాళ్లతో ప్రవాహాన్ని తలపించరాదు.
అలాగే హిందీ, మరాఠి, ఉర్దు, అరబిక్ వంటి భాషలు చదవగలిగిన వాళ్ళు మీ గ్రూపులో ఎందరున్నారు? అవేం అర్థం చేసుకోకుండా డంప్ చేయడం మిగతావారిని అగౌరవపరచటమే.
మీ గ్రూపులో సుబ్బారావు ఉదయం 10 గంటలకు పంపిన మెసేజిని 11.30 అప్పారావు, అదే మెసేజిని 3.00 గంటలకు పుల్లారావు పంపారనుకోండి. దానర్థం ఏమిటి? ఎవరూ ఇంకొకరు పంపే మెసేజిలను చూడకుండా తమకు వచ్చినవి వచ్చినట్టు ఫార్వర్డ్ చేస్తున్నారనేగా.
పంపిన మెసేజినే పదేపదే పంపడం ఇతరుల అటెన్షన్ను, సమయాన్ని, ఛార్జింగ్‌ను దుర్వినియోగం చేయడం కాదా?
ఒకేసారి పదేసి ఫోటోలు, వీడియోలు, మెసేజిలు, ఆడియో క్లిప్పులు పంపుతూంటారు కొందరు. అన్నేసి పంపితే చూడటానికి ఎవరూ ఖాళీగా ఉండరు కదా. అన్నేసి మెసేజిలు ఒకేసారి చెత్తలా పంపడం సరికాదు.
వీడియోలు కొందరు వాట్సప్ గ్రూపుల్లో పెడతారు. అది 10 ఎంబి ఉంటుంది. అందులో ఏముందో కింద టెక్ట్స్ మెసేజ్ పెడితే అవసరం అనుకున్న వాళ్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు. లేకపోతే అందరూ డౌన్లోడ్ చేయడం వల్ల అందరి మొబైల్ డేటా, సమయం, సెల్ లైఫ్ వృధానే. అలాగని వదిలేస్తే ముఖ్యమైనది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.
మీరు ఫార్వర్డ్ చేసే వీడియోని మొదట మీరు చూసి బాగుంది అనుకుంటే వీడియో దేనికి సంబంధించినదో కింద మెసేజ్ పెట్టండి.
వాట్సప్ పుట్టినప్పట్నించి చెలామణి అవుతున్న కొన్ని పనికిమాలిన మేసేజిలు ఉన్నాయి. అలాంటివి మీకు వచ్చినా ఇంకొకరి నెత్తిన రుద్దకండి.
గ్రూపుల్లో ఆసక్తికర చర్చలు జరగాలి. అభిప్రాయాలు కలబోసుకోవాలి. ఒక అంశానికి నూతన కోణాలను స్పృశించాలి. అందరి మేథస్సును చిలకాలి. ప్రేరణ కలిగించే భావనలు వెదజల్లాలి. పరివర్తన తీసుకువచ్చే పోస్టింగులు పెట్టాలి. సమకాలిన అంశాలపై అభిప్రాయాల వెల్లడికి వేదిక కావాలి.
గ్రూపుల్లోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. నీవు చెప్పింది తప్పని పక్కవారిపై దాడి చేసే స్వభావం మంచిది కాదు. మీ అభిప్రాయాలు మీకుండనీయండి. కాలమే నిరూపిస్తుంది ఎవరి అంచనాలు నిజమో అని ఊరుకుంటే తగవులకు అవకాశం ఉండదు.
మనం పెట్టే పోస్టింగులు ఎప్పుడూ సాధ్యమైనంత సంక్షిప్తంగా ఉంటే ఎక్కువమంది చదువుతారు. దినపత్రికలో చిన్న వార్తలు చదివేవారే ఎక్కువ ఉంటారు. వ్యాసాలు చదివే తీరిక అందరికీ ఉండదు.
గ్రూపులో 50 మంది ఉంటే... కేవలం ఓ పదిమందే చురుకుగా ఉండి మిగతా వారు అనాసక్తిగా ఉన్నట్టయితే ఆ గ్రూపులో ఏదో లోపం ఉండి ఉండాలి.
గ్రూపులో సభ్యులు తమకు వచ్చిన ఫోటోలు, వీడియోలు, మెసేజిలు యథాతధంగా వేరే గ్రూపుల్లోకి కుమ్మరించడం నేరం.
ఎందుకు నేరం అంటే మనం ఫార్వర్డ్ చేసేది అసలు ఎవరికి ఉపయోగం? ఎవరికి ఆసక్తి? కొత్తగా తెలుసుకునేది, ప్రేరణ పొందేది ఏమింటుంది? అనే విషయాలు పట్టకుండా గ్రూపులోని అందరి ఛార్జింగ్ (తద్వారా కరెంటు దుర్వినియోగం)ని, సమయాన్ని వృథా చేయటం నేరమే కదా?