శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:41 IST)

సంగీతప్రియులకు శుభవార్త... యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఇక ఫ్రీ

సంగీతప్రియులకు శుభవార్త. యూట్యూబ్‌ మ్యూజిక్‌ కస్టమర్లకు గూగుల్‌ సరికొత్త ఆఫర్‌ని అందుబాటులోకి తేనుంది. ఇప్పటివరకు పెయిడ్‌ సర్వీసుగా ఉన్న యూట్యూబ్‌ మ్యూజిక్‌.. కస్టమర్లకు త్వరలో ఫ్రీగా అందివ్వనున్నట్లు గూగుల్‌ నిర్ణయించింది. 
 
ఈ ఆఫర్‌ వల్ల ఎఫ్‌ఎం రేడియో మాదిరిగా.. యూట్యూబ్‌ మ్యూజిక్‌ను వినొచ్చు. ఇప్పటివరకు యూట్యూబ్‌ సంగీతాన్ని వినాలంటే.. కచ్చితంగా వీడియో ప్రదానమైన సంగీతాన్నే చూడాల్సి వచ్చింది. దీంతో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రెయిన్‌ అయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్‌ సంస్థ యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 
 
ఈ మ్యూజిక్‌ యాప్‌ వల్ల స్క్రీన్‌ ఆఫ్‌ చేసి పాటలు వినొచ్చు. అలాగే ఇతర యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ యాప్‌ను గూగుల్‌ పెయిడ్‌ సర్వీస్‌గా అందుబాటులోకి తేవడంతో.. ఈ యాప్‌ చాలామందికి చేరువకాలేకపోయింది. దీంతో తాజాగా పెయిడ్‌ సర్వీస్‌గా ఉన్నదాన్ని ఫ్రీగా అందించాలని నిర్ణయించింది. ఇకనుంచి మ్యూజిక్‌ వినాలనుకునే కస్టమర్లు... ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఫ్రీగా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
 
యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఈ సర్వీసును మొదట కెనడాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు.. ఆ తర్వాత దశలవారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. 
 
అయితే ఫ్రీ సర్వీసులో యాడ్స్‌ వస్తాయని.. యాడ్స్‌ వద్దనుకునే కస్టమర్లు పెయిడ్‌ సర్వీస్‌ని ఎంచుకోవచ్చని సూచించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆస్కారముంది.