1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (12:08 IST)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రా వాసుల మృత్యువాత

sumo accident
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆంధ్రావాసులు మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని చిక్‌బళ్ళాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని టాటా సుమో అమిత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరస కూలీలంతా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
దసరా పండుగకు కూలీలంతా సొంతూళ్లకు వచ్చారు. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్న వారంతా తిరిగి కూలీ పనులకు బెంగుళూరులోని హోంగసంద్రకు వెళుతుండగా తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా ఉండటంతో ముందు ఆగివున్న వాహనాలు కనిపించలేదు. దీంతో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగివున్న ట్యాంకర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు చిక్‌బళ్లాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.