బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (17:34 IST)

మరో రెండు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే : రణదీప్ గులేరియా

దేశఁలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో ఇంకా తగ్గిపోలేదని, అందువల్ల మరో రెండు నెలల పాటు మరింత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఇప్పటికీ దేశంలో సగటున 30 వేల కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
ఇది దేశంలో రెండో దశ వ్యాప్తి కొనసాగుతుందనేందుకు నిదర్శనమన్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికలను కూడా వైద్య నిపుణులు చేస్తున్నారు. అందువల్ల వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం మహమ్మారి నుంచి బయటపడి మునుపటి పరిస్థితికి వెళ్లొచ్చని చెప్పారు. మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
 
వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరంకాకుండా చూస్తుందని తెలిపారు. 
 
కరోనా మహమ్మారి ప్రస్తుతం తిరోగమనంలో సాగుతోందని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకురాకూడదని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమ్మి కూడా కూడదని చెప్పారు.