కొరాఢా ఝుళిపించిన ఈసీ : ఏ.రాజాపై 48 గంటల ప్రచార నిషేధం
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాపై కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయన చేసిన వ్యాఖ్యల పర్యావసానంగా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు అని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
తమిళనాడు శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇటీవల ఓ ప్రచార సభలో రాజా మాట్లాడుతూ.. సీఎం పళనిస్వామి తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనలో ఏ రాజా క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే, రాజా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నట్లు ఉన్నాయని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం ఆరోపించింది. అన్నాడీఎంకే నేతల ఫిర్యాదుతో ఈసీ కొరఢా ఝుళిపించింది. కాగా, ఏప్రిల్ ఆరో తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.