బీజేపీలో చేరితో ఒక్క రోజులో మంత్రిని చేస్తామన్నారు... సినీ నటి రమ్య
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల పదో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా కన్నడ నటి, సినీ నటి, మాజీ ఎంపీ రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తానని బీజేపీకి చెందిన ఓ నేత ఆఫర్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించి కన్నడనాట కలకలం రేపారు. అయితే, తాను ఆ ఆఫర్‌ను అపుడే తిరస్కరించినట్టు చెప్పారు.
మాండ్యా మాజీ ఎంపీ అయిన రమ్య గత 2019లో కాంగ్రెస్ సోషల్ మీడియాలో సెల్‌ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రమ్య మాట్లాడుతూ, తనకు బీజేపీపై వ్యతిరేకత లేదన్నారు. కొందరు నాయకులు, వారి సిద్ధాంతాలు మాత్రం ఏమాత్రం గిట్టవన్నారు. సినిమా నటులను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తే నగదు పంచకుండానే ఓట్లు వచ్చేస్తాయని కొందరు నేతలు అనుకుంటున్నాని, నిజానికి సినిమా నటులు ప్రజాదారణ ఉన్న వ్యక్తుల ప్రచారానికి వచ్చినంత మాత్రాన ఓట్లు రాలవని రమ్య స్పష్టం చేశారు.