ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (08:15 IST)

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్... ఆనంద్ శర్మ రాజీనామా

anand sharma
కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు ఇదే బాటలో మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ పీసీసీ స్టీరింగ్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. 
 
తనను పిలవకుండానే, కనీసం సంప్రదించకుండానే స్టీరింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని ఆనంద్ శర్మ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తన ఆత్మగౌరవం దెబ్బతిందని, ఆత్మగౌరవంపై రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అయితే, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున తాను ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. 
 
కాగా, 1982లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్ శర్మను నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1984లో రాజ్యసభకు  పంపారు. అప్పటి నుంచి మొన్నటివరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. పలు శాఖలకు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.