గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెరాసకు రాజీనామా చేసిన కె. రాజయ్య యాదవ్ - సీఎం కేసీఆర్ మాట తప్పారు

k rajaiah yadav
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి 22 యేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు దక్కడం లేదంటూ ఆవేదన చెందుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తీవ్రమైన మనోవేదన, బాధతోనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
 
ఇదే అంశంపై ఆయన హనుమకొండలో విలేకరులతో మాట్లాడుతూ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కీసీఆర్‌‍పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు లేవన్నారు. కేసీఆర్ కష్టసుఖాల్లో తాను పాలుపంచుకున్నానని, 22 యేళ్లపాటు ఉద్యమంలో ఆయనతో పాటు అడుగులోఅడుగు వేశానని గుర్తుచేశారు. 
 
ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. ఉద్యమం కోసం పోరాడిన సొంత పార్టీ నేతలను విస్మరించడమే కాకుండా వారు వృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.