మాజీ సీఎం సుఖ్‌బీర్‌పై కాల్పులకు యత్నం ... నిందితుడిని పట్టుకున్న అనుచరులు!! (Video)
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనను తుపాకీతో కాల్చి చంపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ వ్యక్తిని అక్కడున్న వారు గుర్తించి పట్టుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సమయంలో ఆయన సిక్కులకు వ్యతిరేకంగా పని చేసిన డేరా బాబాతో చేతులు కలిపినట్టు సిక్కుల అత్యున్నత సమస్థ అకాల్ తక్త్ నిర్ధారించింది.
ఈ నేరానికి శిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఆయన స్వర్ణదేవాలయం సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ ఆదేశాలతో మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు కాలు విరిగి వుండటంతో చక్రాల కుర్చీలోనే మంగళవారం ఉదయమే ఆలయానికి చేరుకుని కాపలాదారుడుగా ఉన్నారు. అలాగే, ఆలయంలో వంటశాలను, సామాగ్రిని శుభ్రం చేశారు. మరుగుదొడ్లను క్లీన్ చేశారు. పైగా, తాను అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పును అంగీరిస్తున్నట్టు రాసిన పలకను మెడలో వేసుకుని ఆలయ ద్వారం వద్ద కాపలాదారుగా విధులు నిర్వహిస్తున్నారు.
స్వర్ణదేవాలయం ద్వారం వద్ద బాదల్ చక్రాల కుర్చీలో కూర్చొని చేతిలో బల్లెం పట్టుకుని ఉండగా, ఓ వృద్ధుడు ఆయన సమీపానికి వచ్చి తన దుస్తుల్లో దాచిన తుపాకీని తీస్తుండగా, బాదల్ అనుచరులు గమనించి ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. వృద్ధుడు చేతులను గట్టిగా పట్టుకుని తుపాకీని లాక్కొనే ప్రయత్నం చేశాడు. ఇంతలో మిగిలివారు కూడా ఆ వ్యక్తిని పట్టుకోవడంతో పెనుగండం తప్పింది. కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని నారైన్ సింగ్‌గా గుర్తించారు. గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో సభ్యుడుగా పని చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.