శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (16:58 IST)

రాజీవ్ 15 పైసలు కథను గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఏంటా కథ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన కథను ప్రధాని మోడీ ఇపుడు గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి బయలుదేరితే అట్టడుగు చేరేసరికి 15 మాత్రమే మిగిలుతున్నదని ఒకానొక సందర్భంలో రాజీవ్ గాంధీ అన్నారు. ఈ కథను ప్రధాని మోడీ ఇపుడు చెప్పుకొచ్చారు. 
 
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరిగిన ప్రవాసి భారతీయ దివస్‌ ఈవెంట్‌లో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జరిగిన ఈ 85 శాతం దోపిడీని టెక్నాలజీ సాయంతో తమ హయాంలో పూర్తిగా ఆపేశామని మోడీ వెల్లడించారు. 'మేము ప్రజలకు రూ.5 లక్షల 80 వేల కోట్లు ఇచ్చాం. వివిధ పథకాల కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లలోకే నేరుగా పంపించాం. పాత పద్ధతి ప్రకారమే మేము కూడా వ్యవహరించి ఉంటే సుమారు రూ.4.5 లక్షల కోట్లు మాయమైపోయేవి' అని మోడీ గుర్తుచేశారు. 
 
కాగా, ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఎక్కడా కూడా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజ్‌ను ఆపడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని ఒకరు అవినీతి గురించి చెప్పడం మీరు వినే ఉంటారు. ఢిల్లీ నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే సగటు మనిషికి చేరుతున్నది. మిగతా 85 పైసలు మాయమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పాలించిన పార్టీ దీనిని పట్టించుకోలేదు అని ప్రధాని వ్యాఖ్యానించారు.