సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (11:15 IST)

గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కాల్చివేత.. యూపీ వ్యాప్తంగా 144 సెక్షన్

up police
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్‌ని ముగ్గురు వ్యక్తులు కాల్చివేశారు. మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు కణితికి గురిపెట్టి తుపాకీని పేల్చడంతో వారు అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. వైద్య పరీక్షల కోసం పోలీసులే ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ హత్య తర్వాత ముగ్గురు నిందితులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. ఈ జంట హత్యల తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుచేసింది. 
 
వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, ఆయన సోదరుడిని గత రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో రిపోర్టర్ల ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పోలీసులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలను మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. 
 
ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ సహా అదనపు బలగాలను రప్పించి, అన్ని జిల్లాల్లోనూ మొహరించారు. అతీక్, ఆయన సోదరుడిని కాల్చి చంపిన ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. 
 
మరోవైపు, అతీక్, ఆయన సోదరుడు అష్రాఫ్ హత్య జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.