మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:31 IST)

బెంగుళూరులో దారుణం : మత్యుఘంటికలు మోగించిన గుంతలు

దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో దారుణం జరిగింది. రహదారులపై ఉన్న గుంటలు మృత్యుఘంటికలను మోగిస్తున్నాయి. తాజాగా మంచినీటి పైపుల కోసం తవ్విన గుంటలో పడి 47 యేళ్ళ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బెంగళూరులోని పిన్యా కాలనీ, కేశరఘట్ట రోడ్డులో ఓ స్కూల్ సమీపంలో జరిగింది. 
 
పిన్యాలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేసే ఆనంద్ అనే వ్యక్తి శనివారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్కూల్ సమీపంలో ఉన్న గుంతను గమనించకపోవడంతో బైక్ గుంతలోకి దూసుకుపోయింది. దీంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
 
తవ్విన గుంత వద్ద ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. కనీసం బారికేడ్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ గుంత ఉన్న విషయాన్ని వాహనదారులు గమనించలేకపోతున్నారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో తవ్విన గుంతలను కాంట్రాక్టర్ ఇప్పటికీ పూడ్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.