ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)
బెంగుళూరు నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచాడు. తన ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు నిండా డబ్బులు ఉన్న బ్యాగును మరిచిపోయాడు. బ్యాగు నిండా డబ్బులు చూసినా ఆ ఆటో డ్రైవర్ మనసు చలించలేదు. ఆ డబ్బుల బ్యాగును దాన్ని పోగొట్టుకున్నవారికి తిరిగి అప్పగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఒకరోజు ఓ ప్రయాణికుడు డబ్బులు ఉన్న బ్యాగును ఆటోలో మర్చిపోయి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత బ్యాగును గమనించిన డ్రైవర్ రాజు.. ఆ డబ్బును తీసుకోకుండా దాన్ని పోగొట్టుకున్న ప్రయాణికుడి వద్దకువెళ్లి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. దీంతో ఆటో డ్రైవర్ నిజాయతీని ఆ ప్రయాణికుడు ప్రశంసిస్తూ తన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ విషయాలు పంచుకుంటూ ఆ ప్రయాణికుడు ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అదికాస్త తెగ వైరల్ అవుతుంది. డ్రైవర్ రాజు నిజాయతీని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'మానవత్వం ఇంకా ఎక్కడో బతికే ఉంది' అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. ఆటో డ్రైవర్ చేసిన పనిని మరొకరు ప్రశంసిస్తూనే నిజాయతీపరులకు ఎలాంటి ప్రతిఫలం లభించదని నిరాశ వ్యక్తంచేశారు.