గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (13:03 IST)

కర్ణాటకలో హై డ్రామాకు తెరపడింది.. మ్యాజిక్ చేసిన యడ్డ్యూరప్ప..

కర్ణాటకలో హై డ్రామాకు తెరపడింది. కర్ణాటక విధాన సౌధలో ముఖ్యమంత్రి యడియూరప్ప 'మ్యాజిక్‌' చేశారు. విశ్వాస పరీక్షలో సునాయాసంగా గెలుపొందారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 104 దాటి రెండు ఓట్లను అధికంగా దక్కించుకుంది. విశ్వాస పరీక్షకు అనుకూలంగా మొత్తం 106 మంది సభ్యుల ఓటేశారు.


మూజువాణి ఓటు ద్వారా యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో.. కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి సోమవారంతో తెరపడినట్టయింది.
 
అంతకముందు ఇవాళ విధానసౌధలో యడియూరప్ప మాట్లాడుతూ  'జరిగిందంతా మరచిపోతా. అందరినీ క్షమిస్తా. నన్ను వ్యతిరేకించిన వారిని కూడా ప్రేమిస్తా' అని చెప్పారు. కరువుతో అల్లాడుతున్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. 
 
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ సభ ప్రారంభమవగానే నిర్వహించిన విశ్వాస పరీక్షలో బీజేపీ విజయం సాధించింది. ఆ వెంటనే రమేష్‌కుమార్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని కొంత మంది బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతో ఆ పదవికి రమేష్‌కుమార్ రాజీనామా చేశారు.