శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 మే 2020 (16:40 IST)

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు మాస్క్‌ తయారు చేసిన ఇంటర్ విద్యార్ధిని

కరోనా వైరస్ ను హతమార్చే మాస్కును తయారు చేసింది 17ఏళ్ల ఇంటర్ విద్యార్ధిని. ఈ మాస్క్ నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్)ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తరహా మాస్క్‌లను ఉత్పత్తికి సమ్మతిని కోరుతూ ఎన్ఐఎఫ్‌కు చెందిన డాక్టర్‌ వివేక్‌ కుమార్‌ దిగంతికాకు ఉత్తరం రాశారు.

ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి ప్రజల్ని కాపాడాలంటే నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వారికి సపోర్ట్ చేస్తోంది. 

వెస్ట్ బెంగాల్ బర్దమాన్‌ జిల్లాకు చెందిన దిగంతికా బోస్ ఇంటర్ చదువుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇష్టం. కరోనా వైరస్‌తో ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన ఇన్నోవేషన్‌తో ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండే దిగంతికా బోస్ కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తన వంతు కృషి చేయాలని అనుకుంది.

అనుకున్నదే తడువుగా కేవలం ఏడు రోజుల్లో ఓ మాస్క్‌ను తయారు చేసింది. ఆ మాస్క్‌ను ధరించిన వారు కరోనా నుంచి సురక్షితంగా ఉండటమే కాదు, దాన్ని హతమార్చేలా డిజైన్ చేసింది. డిజైన్ చేసిన తరువాత మాస్కును ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బోస్ అనుమతి తీసుకుంది.

నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నిర్వహించిన ఛాలెంజ్ కోవిడ్ -19 పోటీలో 17 ఏళ్ల దిగంతికా బోస్, ఆమె తయారు చేసిన మాస్క్‌ను సమర్పించింది. అనేక ఆవిష్కరణలను షార్ట్ లిస్ట్ చేసిన తరువాత ఫైనల్ లిస్ట్‌లో ప్రజల్ని కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు దిగంతికా తయారు చేసిన మాస్క్‌కు మద్దతు పలికారు.
 
మాస్క్‌కు రెండు పొరలున్నాయి. ఈ మాస్క్ ధరించిన వ్యక్తి గాలి పీల్చినప్పుడు మొదటి పొరలోకి వెళ్లిన దుమ్ము, దూళితో పాటు వైరస్ యెక్క లిపిడ్ ప్రొటీన్‌ను నాశనం చేస్తుంది. ఇక రెండో పొర స్వచ్ఛమైన గాలి లోపలికి వెళ్లేందుకు సాయపడుతుంది. సాధారణంగా మాస్క్‌లు వైరస్‌ సోకకుండా నియంత్రిస్తాయి. కానీ దిగంతికా డిజైన్‌ చేసిన మాస్క్‌ మాత్రం వైరస్‌ను అడ్డుకోవడంతో పాటు దాన్ని చంపేస్తుంది కూడా.

ఇందులో రెండు పొరలు ఉంటాయి. వీటిల్లో రెండు వాల్వ్స్‌, ఫిల్టర్లు ఉంటాయి. ఇది కొవిడ్‌ రోగి నుంచి వెలువడే ప్రతి వైరస్‌ను గాలి పీల్చే సమయంలో చంపేస్తుంది. ఇది ప్రధానంగా కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులకు ఉపయోగపడుతుంది.