శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (08:38 IST)

కేంద్రం ఖర్చులతో కరోనా వారియర్లకు వ్యాక్సిన్ : నరేంద్ర మోడీ

దేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ వినియోగానికి రానుంది. తొలివిడతలో కరోనా వారియర్లకు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్ని  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
జనవరి 16 నుంచి మొదలయ్యే కరోనా మొదటి వ్యాక్సినేషన్‌లో ముందు వరుస యోధులకే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టంచేశారు. అందుకు అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వివరించారు.
 
తొలి విడతలతో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, త్రివిధ దళాలు, పోలీసులు, పారామిలిటరీ దళాలకు మొదటి విడతలో వ్యాక్సిన్ అందజేస్తారన్నారు. రెండో విడతలో 50 ఏళ్ల పైబడినవారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వాళ్లకు టీకాలు వేసేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. 
 
కాగా, ప్రజాప్రతినిధులకు కూడా తొలివిడతలోనే వ్యాక్సిన్ ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా మోడీ స్పందించినట్టు తెలిసింది. రాజకీయనేతలు వ్యాక్సిన్ కోసం మరికొంతకాలం ఆగాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. కానీ, చాల మంది ఎంపీలు మాత్రం తమకు తొలి విడతలోనే వ్యాక్సిన్లు వేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెల్సిందే.