బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (08:05 IST)

పెరుగుతున్న కరోనా కేసులు.. భయపెడుతున్న కొత్త వేరియంట్

Covid test
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్ వెలుగు చూసింది. ఒకవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరుగడంతో పాటు మరోవైపు కొత్త వేరియంట్ వెలుగు చూస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలాగే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా, కరోనా  చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. 
 
ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఇందుకు సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 
 
మరోవైపు, కేరళలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దృష్ట్యా గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. 
 
ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్‌ ధరించడం అవసరమన్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.