లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మోటార్ సైకిల్ తయారు చేసిన బాలుడు
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో చాలామంది ఇంటి పట్టునే వుండిపోయారు. ఇంట్లో సమయాన్ని వృధా చేస్తూ.. టీవీలకు అతుక్కుపోయిన వారు చాలామందే వుండివుంటారు. కానీ ఓ బుడ్డోడు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా.. ఓ బండి తయారు చేశాడు. ఖాళీగా ఉండే వారిలో కొందరికి చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా పదవ తరగతి చదివే బాలుడికి కొత్త ఐడియా వచ్చింది.
లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండలేక ఏకంగా ఆ బాలుడు బైక్ తయారు చేసుకుని సంచలనం సృష్టించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగడ్‌లో పదవ తరగతి విద్యార్థి గౌరవ్ స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి.. మోటారు సైకిల్ తయారు చేశాడు.
ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను 3 సంవత్సరాల క్రితం స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశానని తెలిపాడు. కానీ అది స్పీడ్‌గా వెళ్లలేకపోవడంతో.. తాను ప్రస్తుతం పెట్రోల్ మోటార్ సైకిల్‌గా దాన్ని మార్చానని వెల్లడించాడు. అది లీటరు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వివరించాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.