శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:03 IST)

చంద్రయాన్‌-2 డేటా విడుదల

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని గత ఏడాది చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై దిగడానికి కొద్ది సెకన్ల ముందు చంద్రయాన్‌ 2 ల్యాండింగ్ అయ్యే ప్రయత్నంలో ల్యాండర్, రోవర్ ధ్వంసం కావడంతో ఆ ప్రయోగం విఫలమైంది.

ఆ సమయంలో ల్యాండర్ క్రాష్ అయ్యింది కానీ.. చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం బాగానే పని చేస్తుంది. ఈ ప్రయోగాన్ని చేపట్టిన 16 నెలల తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కక్ష్యలో ఉన్న ఎనిమిది పరికరాల సహాయంతో గ్రహించిన మొదటి డేటాను బయటకి విడుదల చేసింది.
 
ఇస్రో పంపిన అన్ని మిషన్ల డేటాను బెంగళూరు సమీపంలోని ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ సేకరిస్తుంది. ప్రస్తుతం చంద్రయాన్ 2 డేటాను సేకరించి పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం ఇస్రో‌ ప్లానెటరీ డాటా సిస్టమ్‌ పీడీఎస్ 4 ఫార్మాట్‌లో ఉన్న డేటాను గ్లోబల్‌ సైంటిఫిక్‌ కమ్యూనిటీతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉంచడం కోసం ఇస్రో ప్రధాన్ పోర్టల్ ద్వారా డేటాను విడుదల చేసింది.

చంద్రయాన్ 2లోని ల్యాండర్ క్రాష్ అయినప్పటికీ ఆర్బిటార్‌, ఇస్రో మధ్య సమాచార మార్పిడి కొనసాగుతుంది. ఇప్పుడు ఆ ఆర్బిటార్‌ చంద్రుడి ఉపరితలానికి సంబందించిన కీలక సమాచారాన్ని ఇస్రో డేటా సెంటర్ కి పంపుతుంది. భవిష్యత్ లో అక్కడికి రోబోట్లు లేదా మనుషులను పంపడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడనుంది.