శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (17:13 IST)

చంద్రుడికి మరింత దగ్గరగా... వ్యోమనౌక ఐదో కక్ష్యం పెంపు

chandrayaan
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా, వ్యోమనౌక తన లక్ష్యం దిశగా దూసుకుని వెళుతుంది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన అయిదో కక్ష్య పెంపును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని 'ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌' నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీంతో చంద్రయాన్‌ ఇప్పుడు 127609 కి.మీ x 236 కి.మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.
 
మరోవైపు, భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్‌-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య. దీని తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ విన్యాసాన్ని ఆగస్టు ఒకటో తేదీన చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 
 
ఆ మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటివరకు దశలవారీగా ఐదుసార్లు పెంచి.. చంద్రయాన్‌-3ని జాబిల్లికి చేరువచేస్తున్నారు. ఐదో భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టాల్సివుంది.