గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో మోగిపోయింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.
గంగలూరు అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని, అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.