చికెన్ అమ్మకాలు.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఆరా తీస్తే?
మొన్న బక్రీద్ పండుగ నాడు కూడా చికెన్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించాడు కేరళ వ్యక్తి. అసలు వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వట్టంకులం అనే ప్రాంతంలో 31 ఏళ్ళ అఫ్సల్ స్థానికంగా చికెన్ షాప్ నడుపుతున్నాడు.
ప్రతీసారి తన షాప్‌కు వచ్చిన కస్టమర్లకు అదిరిపోయే డిస్కౌంట్లతో తక్కువ ధరకే చికెన్ విక్రయిస్తూ వచ్చాడు. బక్రీద్ ఫెస్టివల్ సమయంలోనూ రూ. 10 నుంచి రూ. 20 వరకు చికెన్‌పై డిస్కౌంట్ ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అఫ్సల్ షాప్ రద్దీగా మారగా.. స్థానికంగా ఉండే మిగతా చికెన్ షాపులు విలవిలలాడాయి.
అసలే తక్కువ ధరలు.. ఆపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అయినా అఫ్సల్‌కు లాస్ ఎందుకు రావట్లేదు. లాభాలు ఎలా వచ్చి పడుతున్నాయని మిగతా షాప్ యజమానులకు డౌట్ వచ్చింది. దీనితో వారంతా కలిసి కూపీ లాగగా.. అసలు విషయం బయటపడింది.
రిమోట్ కంట్రోలర్ ద్వారా తన తూకాన్ని తారుమారు చేస్తూ.. కస్టమర్లను అఫ్సల్ మోసం చేస్తున్నాడని గుర్తిస్తారు. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. కాగా, అఫ్సల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.