సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (12:24 IST)

నీట్ యూజీ ప్రవేశపరీక్షపై సుప్రీంలో విచారణ - దేశ వ్యాప్తంగా పేపరీ లీక్ అయిందా? సీజేఏ ప్రశ్న!!

neet exam
యూజీ నీట్ ప్రవేశ పరీక్షా ప్రశ్నం లీకేజీ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రశ్నపత్రం లీక్ దేశమంతటా విస్తరించిందనేందుకు ఎక్కడా ఆధారాలు లేవని కామెంట్స్  చేశారు. నీట్ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
పేపర్ లీక్ జరిగిందనేది వాస్తవమేనని, అయితే, లీక్ అయిన పేపర్ దేశమంతటా సర్క్యులేట్ అయిందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. బీహార్ కేంద్రంగా పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లీకేజీకి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని గత విచారణలో ఆదేశించారు. ఇప్పటివరకు సమర్పించిన ఆధారాలను పరిశీలించగా.. లీక్ అయిన పేపర్ విస్తృతంగా షేర్ అయిందనేందుకు ఆధారాలు లేవని వివరించారు. 
 
బీహార్ 7లోని హజారీబాఘ్, పాట్నాలలో పేపర్ లీక్ జరిగిందనే విషయాన్ని సీజేఐ అంగీకరిస్తూనే.. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు పేపర్ వెళ్లిందనేందుకు ఆధారాలు ఉంటే చెప్పాలని అడిగారు. ఉదయం 9 గంటలకు పేపర్ లీక్ అయిందని, 10:30 గంటల వరకు స్థానిక పరీక్షా కేంద్రాలకు చేరిందని కోర్టు విశ్వసిస్తోందని సీజేఐ తెలిపారు. కోర్టు నమ్మకాన్ని తప్పని నిరూపించే ఆధారాలు ఉంటే వెల్లడించాలని పిటిషన్ దారులకు సూచించారు. సీబీఐ అందించిన నివేదిక ప్రకారం నీట్ యూజీ ప్రశ్నాపత్రం ఎక్కడ ముద్రించారనే విషయం తమకు తెలిసిందని, అయితే, ఆ విషయాన్ని బహిరంగపరిచే ఉద్దేశం తమకు లేదని అన్నారు.