శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:27 IST)

2 నెలల్లో కరోనా టీకా: సీసీఎంబీ డైరెక్టర్

కరోనా మహమ్మారి నివారణకు టీకాను మరో రెండు నెలల్లోనే కనుగొనే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించారు.

గతంలో పోలియో, రేబిస్ టీకాలను తయారు చేసిన క్రియారహిత (ఇన్ యాక్టివేటెడ్) వైరస్ టీకాపై తాము దృష్టిని సారించామని ఆయన అన్నారు.
 
టీకా తయారీ విధానాన్ని గురించి వివరించిన ఆయన, తొలుత సజీవ వైరస్ లను ల్యాబ్ లో అధికంగా పెంచుతామని, ఆపైన వాటిపై రసాయనాలు, వేడిని ప్రయోగించడం ద్వారా క్రియారహితం చేసి, ప్రజలకు టీకా రూపంలో వేయాల్సి వుంటుందని అన్నారు.

వేడి చేయడం ద్వారా వ్యాధి కారకమైన ప్యాథోజెన్ చనిపోయి, వైరస్ పెరిగే సామర్థ్యం నిలిచిపోతుందని అన్నారు. వీటితో ప్రజలకు ముప్పు ఉండదని, పైగా ఇన్ యాక్టివేటెడ్ వైరస్ టీకా శరీరంలోకి వెళ్లగానే, అది వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు అందిస్తుందని అన్నారు.
 
ఆపై వైరస్ శరీరంపై దాడి చేయగానే, యాండీ బాడీలు భారీగా విడుదలై, వైరస్ పై యుద్ధానికి దిగుతాయని, అనారోగ్యంతో బాధపడేవారు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులకు క్రియా రహిత టీకా ఇవ్వడం సురక్షితమని తెలిపారు. ప్రయోగశాలలో వైరస్ ను పెంచిన తరువాత టీకాల తయారీకి పరిశ్రమలకు కూడా వైరస్ ను ఇస్తామని తెలిపారు. 
 
కాగా, వైరస్ ను వృద్ధి చేయడం ఇక్కడి వాతావరణానికి సవాలేనని, ఆఫ్రికన్ గ్రీన్ కోతి కణాలకు మానవ కణాలకు పోలికలు ఎక్కువగా ఉండటంతో వీటిపై సెల్ వైరస్ కల్చర్ చేస్తున్నామని కణాల్లో వైరస్ వృద్ధి చెందేలా చూస్తున్నామని రాకేశ్ మిశ్రా వెల్లడించారు.