గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (18:56 IST)

కరోనా స్ట్రెయిన్ : కర్నాటకలో కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ 144 సెక్షన్ అమలు

కరోనా స్ట్రెయిన్ దెబ్బకు వణికిపోయి కర్ఫ్యూ విధించిన కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాత్రిపూట విధించిన కర్ఫ్యూను ఎత్తివేసింది. కానీ, బెంగుళూరు నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ మాత్రం అమల్లో ఉంటుందని పేర్కొంది.
 
కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి జనవరి 1 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తామంటూ బుధవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విధించిన కర్ఫ్యూ అమలులోకి రాకముందే నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం గమనార్హం. 
 
బ్రిటన్‌లో కొత్త వైరస్‌ ప్రబలడంతో దాని వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని తొలుత నిర్ణయించినట్టు సీఎం యడియూరప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అయితే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కర్ఫ్యూ అమలు చేయాల్సిన అవసరం లేదని భావించినట్టు తెలిపారు. అందుకే కేబినెట్‌ సహచరులు, సీనియర్‌ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
 
మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించడం ద్వారా ఈ వైరస్‌ కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు.
 
కాగా, బెంగళూరు నగరమంతా 144 సెక్షన్‌ అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. మరో 5 గంటల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుందనగా యడియూరప్ప ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.