1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (16:09 IST)

కరోనా అంతానికి సమయం సమీపిస్తుంది : డాక్టర్ సమీరన్ పాండా

భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఈ యేడాది మార్చి మూడో వారానికి అంతం కావొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే మార్చి 11వ తేదీ నాటికి ఈ వైరస్ అంతం కావొచ్చని తెలిపారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని ఇదేవిధంగా మరికొంత కాలం కొనసాగించినట్టయితే మార్చి 11వ తేదీ తర్వాత ఈ వైరస్ అంతులేకుండా పోతుందన్న నమ్మకం ఉందన్నారు. అయితే, ఈ మధ్యలో కొత్త కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకురాకుండా ఉండాలన్నారు. మార్చి 11వ తేదీ నాటికి ఈ కరోనా వైరస్ సాధారణ ఫ్లూ (ఎండమిక్)గా మారిపోతుందన్నారు. 
 
డెల్టా వైరస్ స్థానాన్ని ఒమిక్రాన్ వైరస్ భర్తీ చేసి, అపుడు మరో కొత్త రకం వైరస్ రాకపోతే కరోనా ఎండమిక్‌గా మారిపోయేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తమ అంచనా మేరకు ఒమిక్రాన్ వైరస్ మూడు నెలలో పాటు ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ మన దేశంలో డిసెంబరు 11వ తేదీన వెలుగు చూసిందని, అంటే మార్చి 11వ తేదీ తర్వాత అంతం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.