ఉద్ధవ్ ఠాక్రే సర్కారుకు మద్దతు ఉపసంహరణ - మైనార్టీలో మహా ప్రభుత్వం
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెబెల్ నేతలు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు వారు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో షిండే దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఠాక్రే సర్కారు అసెంబ్లీలో మైనార్టీలో పడినట్లయింది.
ఇదిలావుంటే, తిరుగుబాటు చేసిన మంత్రులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి మంత్రిత్వ శాఖలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరంలో ఏక్‌నాథ్ షిండే సహా 9 మంది మంత్రులున్నారు. వీరంతా గౌహతిలోని హోటల్‌లో క్యాంపు శిబిరంలో ఉన్నారు.
కాగా, ఈ 9 మంది మంత్రిత్వ శాఖలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహా సీఎంవో కార్యాలయం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాలనా వ్యవహారాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో వీరి శాఖలను ఇతర మంత్రులకు అప్పగించినట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది.
ఏక్‌నాథ్ శిందే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ శాఖలను సుభాశ్ దేశాయ్‌కి అప్పగించారు. ఉదయ్ సామంత్ మంత్రిగా ఉన్న ఉన్నత, సాంకేతిక విద్యాశాఖను ఆదిత్య ఠాక్రేకు బదలాయించారు. ప్రస్తుతం ఠాక్రే కేబినెట్‌లో కేవలం నలుగురు మంత్రులు మాత్రమే ఉండటం గమనార్హం. వీరిలో ఆదిత్య ఠాక్రే మినహా మిగతా ముగ్గురు ఎమ్మెల్సీలే కావడం గమనార్హం.