మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (10:50 IST)

ఉత్తరాదిలో కుంభవృష్టి... ప్రమాద స్థాయిని దాటిన యమునా నది.. ఢిల్లీలో అలెర్ట్

yamuna river
ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక నదులు పొంగిపోర్లుతున్నాయి. మరికొన్ని ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఎగువ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం 206.28 మీటర్లుగా ఉంది. సాయంత్రానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమైంది. యమునా నది పరిసర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి చేపట్టారు. ఢిల్లీలో అత్యధిక వరద ముప్పు స్థాయి 207.49 మీటర్లు. ప్రస్తుతానికి ఆ మార్క్‌ను చేరే అవకాశం లేదని, వర్షాలు తగ్గుముఖం పడితే నీటిమట్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.