శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (09:02 IST)

విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ - ఆర్ఎస్ఎస్ : రిటైర్డ్ జడ్జి చంద్రు

ఒక దేశం పేరుతో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌లు విభజన రాజకీయాలు చేస్తున్నాయని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రూ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ రెండు తమ భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా, ఒక దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. 
 
దేశంలో ఫాసిజం పాలన ఇలానే కొనసాగిన పక్షంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశం పేరుతో విభజన రాజకీయాలు జరుగుతున్నాయని, ఇందుకోసం సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుకుంటున్నాయని ఆయన తెలిపారు. 
 
అలాగే, దేశంలోని అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ హస్తగతం చేసుకుని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. చట్టాలు కనుక అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా లేకపోతే రాజ్యాంగాన్ని సవరిస్తున్నారన్నారు. 
 
అదేసమయంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఎవరి వల్ల ప్రాణహాని ఉందో బహిరంగ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి విషయాలను రాజకీయం చేయడంలో బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.