శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (14:58 IST)

పంజాబ్‌లో "చీపురు" గాలి - కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి

పంజాబ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఢిల్లీ తర్వాత మరో పొరుగు రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. అయితే, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చిత్తుగా ఓడిపోయారు. 
 
పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌తో విభేధించి ఆ పార్టీకి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ సొంతంగా పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన పాటియాలా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, ఇక్కడ పోటీ చేసిన ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలంపాటు కొనసాగడమే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిక్చూచిగా ఉన్న అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 
 
పైగా, ఈ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆయన కొంప ముంచింది. కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను పంజాబ్ రైతులు తీవ్రంగా వ్యతిరకించారు. చివరకు రైతుల ఆందోళనకు తలొగ్గి ఆ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో పంజాబ్ ఓటర్లు బీజేపీతో ఆ పార్టీకి మద్దతిచ్చిన అమరీందర్ సింగ్ వంటి నేతలను చిత్తుగా ఓడించడం గమనార్హం.