శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

సిద్ధరామయ్య అనే నేను.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం

karnataka gov
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా కర్నాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆహ్వానించారు. దీంతో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు సిద్ధరామయ్యకు గవర్నర్ లేఖ రాశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని సిద్ధరామయ్యకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, గురువారం సాయంత్రం బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సిద్ధరామయ్యను తమ సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని డీకే శివకుమార్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దీనికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఈ తీర్మాన ప్రతిని సిద్దరామయ్య, డీకే శివకుమార్ తదితరులు గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్ తిరిగి సిద్ధరామయ్యకు లేఖ పంపించారు. 
 
ఇదిలావుంటే, ప్రమాణ స్వీకారానికి కంఠీరవ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు హాజరుకానున్నారు. 
 
అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్సీపీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖులు తదితరులు హాజరుకానున్నారు.