#GujaratElection2017: తీర్పు నేడే .. ఎగ్జిట్‌పోల్స్ నిజమవుతాయా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. గుజరాత్‌లో ఆరోసారి కూడా అధికారపీఠాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, రెండు దశాబ్దాలుగా దూరమైన అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది.
అయితే, రెండు దశల్లో ముగిసిన ఈ రాష్ట్ర పోలింగ్ తర్వాత వెల్లడైన అన్ని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా తీర్పువస్తుందని స్పష్టంచేసినా, ఓటరు నాడి వేరుగావుందని కాంగ్రెస్ వాదిస్తున్నది. దీనికితోడు 2019 సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనున్న ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది.
కాగా, గుజరాత్‌లోని 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సాగనున్నది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. పది గంటలకల్లా ఓ స్పష్టత రానుంది. తొలిఫలితం అరగంటకే వెలువడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా ఈవీఎంలే వాడినందున మధ్యాహ్నం 12గంటలకల్లా గుజరాత్‌లో, ఉదయం 10గంటలకల్లా హిమాచల్‌లో పూర్తి ఫలితాలు రావచ్చునని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
కాగా, 4.35 కోట్ల మంది ఓటర్లకుగాను 2.97కోట్లమంది ఈసారి తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆదివాసీలు ఎక్కువగా ఉండే నర్మద జిల్లాలో 79.15శాతం, అత్యల్పంగా దేవభూమి ద్వారక జిల్లాలో 59.39శాతం ఓట్లు నమోదయ్యాయి. అహ్మదాబాద్ శివారులోని నవానరోడా కేంద్రంలో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. సోమవారంనాటి ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, స్ట్రాంగ్‌రూంల వద్ద, కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించామని ఎన్నికల అధికారుల ప్రకటించారు.